న్యూఢిల్లీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన పన్నెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కస్టమర్లకు భారీ ప్రమోషనల్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సిడిఎంఎ వినియోగదారులు ఈ నెలలో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఎస్‌టిడి, లోకల్ కాల్స్ చేసుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌కె ఉపాధ్యాయ సోమవారంనాడు వెల్లడించారు. అంతేకాకుండా ఇతర కస్టమర్ల కోసం మరో ఎనిమిది పథకాలను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా అక్టోబర్ నెలలో 650 రూపాయల టాప్అప్‌తో ఏదేని నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, 850 రూపాయలతో ఏదేనీ నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో భాగంగా ప్రీ పెయిడ్ జిఎస్ఎం కస్టమర్ల కోసం ఏడు రోజుల పాటు రూ. 200, రూ.500, రూ.1,000, రూ. 6,000 రూపాయల టాప్ అప్ వోచర్లపై 20 శాతం అదనపు టాక్‌టైమ్‌ను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. పండగల సీజన్ సందర్భంగా అక్టోబర్ 1 నుంచి 7.2 ఎంబిపిఎస్ డేటా కార్డు ధర పై 20 శాతం స్పెషల్ డిస్కౌంట్‌తో పాటు ఎం పిక చేసిన 3 జి డేటా టారిఫ్ ప్లాన్ల రేట్లను 20 శాతం తగ్గించినట్లు చెప్పారు. ఆఫర్‌లో భాగంగా 3జి ప్లాన్‌లోని 1250 ఎంబి (1 జిబి)ని 225 రూపాయలు, 2500 ఎంబి (2జిబి)ని 360 రూపాయలకు అందించనున్నారు.
