లండన్: ఐసీసీ అవార్డుల రేసులో భారత క్రికెటర్లు సచిన్, ధోనీ, గంభీర్ మరింత ముందుకు దూసుకెళ్లారు. కుదించిన తాజా, చివరి జాబితాలోనూ ఈ త్రయం చోటు సాధించింది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా విఫలమైనా ఆ ప్రభావం పడకపోవడం ఊరట కలిగించే విషయం. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులకు గాను భారత త్రయం పోటీ పడుతోంది. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ సోబర్స్ అవార్డు) రేసులో సచిన్‌తో పాటు ఆమ్లా (దక్షిణాఫ్రికా), ఇంగ్లండ్ ద్వయం కుక్, ట్రాట్ నిలిచారు. మాస్టర్‌ను గతేడాది ఈ అవార్డు వరించింది.
ఇక వన్డే ప్లేయర్ అవార్డు కోసం గంభీర్‌తో పాటు ఆమ్లా, సంగక్కర, షేన్ వాట్సన్ పోటీ పడుతున్నారు. భారత్ కెప్టెన్ ధోనీ, కలిస్‌తో కలసి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు… ఆమ్లా, గేల్, సంగక్కరతో పీపుల్స్ చాయిస్ అవార్డు కోసం బరిలో నిలిచాడు. ఈ అవార్డులను సెప్టెంబర్ 12న ప్రదానం చేయనున్నారు. గతేడాది ఆగస్ట్ 11 నుంచి ఈ నెల 3 వరకు చూపిన ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఇతర ఐసీసీ అవార్డుల నామినీలు…
టెస్ట్ ప్లేయర్ : ఆండర్సన్, కుక్, కలిస్, ట్రాట్; ఎమర్జింగ్ ప్లేయర్: అజర్ అలీ, బిషూ, డారెన్ బ్రావో, వాహబ్ రియాజ్; టి-20 ఇంటర్నేషనల్ ఫర్ఫార్మెన్స్: బ్రేస్నన్, డుమినీ, సౌథీ, వాట్సన్.
