‘దుర్గాదేవిగా కనకదుర్గమ్మ’
విజయవాడ : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఎంతో పవిత్రంగా భావించే దుర్గాష్టమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్నఅమ్మ కనకదుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గతుల్ని నాశనం చేసే శక్తిస్వరూపిణి దుర్గాదేవి. ‘దుఃఖేన గంతుం శక్యతే ఇతి దుర్గా’ అంటారు. దుర్గాదేవి అష్టమితిథిరోజు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది. కాబట్టే లోకంలో ‘దుర్గా’ అని కీర్తించబడింది. ఆ అష్టమి దుర్గాష్టమిగా ప్రసిద్ధి పొందింది.
దుర్గాదేవి ఆది ప్రకృతి. పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఈమె శక్తి అనంతమైనది. అందుకే వివిధ మంత్రతంత్ర గ్రంథాల్లో, వివిధరకాల దుర్గాదేవి స్వరూపాలు మనకు దర్శనమిస్తాయి. వీటిలో ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. దుర్గ ఎప్పుడూ ఉగ్రస్వరూపంతోనే కనిపిస్తుంది. అందుకే శంకరాచార్యులు చెప్పినట్లు దుర్గమ్మను దుర్గాసహస్రం, దుర్గా అష్టోత్తరంతో కాక లలితా అష్టోత్తరం, లలితాసహస్రంతో పూజిస్తే ఆమె పరమశాంతి స్వరూపంతో శ్రీలలితగా, కనకదుర్గగా దర్శనమిస్తుంది.
శరన్నవరాత్రుల్లో అమ్మవారు శార్దూలాన్ని (పులి) అధిరోహించి త్రిశూలాన్ని ధరించి శక్తిస్వరూపిణిగా, శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. కనకదుర్గమ్మను దర్శించేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయంలో బారులు తీరారు. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండేందుకు మహిళలు కుంకుమార్చనలు చేస్తున్నారు.
