ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమిళనాడు 22వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, అనంతరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తన పదవిని వదులుకున్నారు. రోశయ్య త్యాగానికి, అధిష్టానం పట్ల విధేయతకుగాను అధిష్టానం ఆయనను గవర్నర్ పదవికి ఎంపిక చేసింది. తన రాజకీయ జీవితంలో ఇదే చివరి పదవి అని చెప్పిన రోశయ్య గవర్నర్‌గా ప్రమాణం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎనలేని సంబంధం ఉందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని చెప్పిన గవర్నర్ రోశయ్య త్వరలో తమిళ భాషను నేర్చుకుంటానని తెలిపారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఆ రాష్ట్రంలోని ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మన రాష్ట్రం పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, డీఎస్, చిరంజీవి తదితరులు హాజరయ్యారు.
